భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, జులై 2026, సోమవారంభారత్ సమాచార్

అమరావతిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టును ప్రారంభించాలి

ebba77f0-40ed-44eb-8d48-f41ea71d6ad6

భారత్ సమాచార్, అమరావతి: అమరావతి రాజధానిలో జర్నలిస్టుల కోసం ప్రతిపాదించిన హౌసింగ్ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సీనియర్ జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. 2019లో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించిన 30 ఎకరాల భూమిలో హ్యాపీనెస్ట్ నమూనాలో బహుళ అంతస్తుల గృహ సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు మాట్లాడుతూ 2019లో అప్పటి ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.67 ద్వారా 30 ఎకరాల భూమిని జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించిందని గుర్తు చేశారు. అనంతరం సీఆర్డీఏ ఆధ్వర్యంలో గృహ నిర్మాణాల కోసం భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తూ ఒప్పందం కుదిరిందని తెలిపారు. అలాగే జీఓ ఎంఎస్ నెం.107 ద్వారా నాలుగు కేటగిరీల్లో హ్యాపీనెస్ట్ తరహాలో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ప్రాజెక్టు ఇప్పటికీ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.

 

సొసైటీ డైరెక్టర్, విశాలాంధ్ర బ్యూరో చీఫ్ చావా రవి మాట్లాడుతూ ప్రస్తుతం అమరావతిలో హ్యాపీనెస్ట్‌తో పాటు ఇతర గృహ నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టును కూడా అదే ప్రాధాన్యంతో ప్రారంభించాలని కోరారు. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి సమావేశం కృతజ్ఞతలు తెలుపుతూ, రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించింది. ప్రపంచ స్థాయి రాజధానిలో ఆదర్శప్రాయమైన జర్నలిస్టుల కాలనీని నిర్మించాలని సమావేశం అభిప్రాయపడింది.

 

2019 నుంచి ఇప్పటి వరకు పలువురు జర్నలిస్టులు పదవీ విరమణ చేయడం, మరికొందరు కరోనా సమయంలో మరణించడం జరిగిందని, వారి కుటుంబాలు ఈ ప్రాజెక్టు అమలుపై ఆశగా ఎదురుచూస్తున్నాయని సమావేశంలో పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని, అందుకే హౌసింగ్ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ డైరెక్టర్లు, వివిధ మీడియా సంస్థలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్మానానికి మద్దతు తెలిపారు.