భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, జులై 2026, మంగళవారంభారత్ సమాచార్

ఎరువుల ధరలు తగ్గించాలంటూ ధర్నా

WhatsApp Image 2026-07-06 at 5.18.24 PM

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ(ఎంఎల్) రైతు సంఘం ఆధ్వర్యంలో ఎరువుల ధరల పెంపును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ చంద నరేష్‌కు వినతిపత్రం సమర్పించి రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎరువుల ధరలను వెంటనే తగ్గించి రైతులకు అందుబాటు ధరల్లో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా 50 కిలోల ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.300 వరకు ధరలు పెంచిందని విమర్శించారు. మరోవైపు రైతులు పండించే పంటలకు స్వల్ప మద్దతు ధరలు పెంచి రైతులను ఆదుకుంటున్నామని చెప్పడం వాస్తవ పరిస్థితులకు విరుద్ధమని అన్నారు. విత్తనం కొనుగోలు నుంచి పంట విక్రయం వరకు రైతుల స్వేచ్ఛను దెబ్బతీసే విధానాలు అమలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వాణిజ్య బ్యాంకులు పంట రుణాలను పూర్తిస్థాయిలో మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో చర్చించి రైతులకు అవసరమైన రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే రైతులు ప్రైవేటు అప్పులపై ఆధారపడాల్సి వచ్చి రుణభారంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ ధర్నాలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIKUS) తొర్రూరు డివిజన్ కార్యదర్శి జక్కుల యాకయ్య, పీవైఎల్ మాజీ జిల్లా కార్యదర్శి ఇరుగు అనిల్‌తో పాటు తోట రవీందర్, సంపత్, కనుకు, మధు, మహేష్, వెంకటమ్మ, లక్ష్మి, తరమ్మ, సుగుణ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ చంద నరేష్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఇదే కార్యక్రమంలో మండలంలోని బంజర గ్రామానికి చెందిన ఇరుగు అనిల్‌తో పాటు మరో ఐదుగురు యువకులు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్‌లో చేరగా, పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.