భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, జులై 2026, శుక్రవారంభారత్ సమాచార్

SIR ఫారాల స్వీకరణలో పాల్గొన్న బీజేపీ నేతలు

6f889b08-92de-4376-9baa-e8ed9a1c4a48

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా:  భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ నమోదు ఫారాల స్వీకరణ ప్రక్రియ గుమ్మడిదల మండల కేంద్రంతో పాటు గుమ్మడిదల, అన్నారం మున్సిపాలిటీల పరిధిలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కావలి ఐలేష్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సార సృజనలక్ష్మి పాల్గొని ఓటర్ల నుంచి ఎస్‌ఐఆర్ ఫారాలను స్వీకరించారు.

గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని 9 పోలింగ్ కేంద్రాలకు చెందిన బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు), బీజేపీ బీఎల్‌ఏ-2 ప్రతినిధులతో కలిసి ఫారాలను పరిశీలించారు. ఫారాలను ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఓటర్లకు సూచించారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాల సమర్పణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కావలి ఐలేష్, సార సృజనలక్ష్మి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ కార్యక్రమం ద్వారా ఓటర్ జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను సరిచేసుకోవాలని, ఫారాలను నిర్ణీత సమయంలో సమర్పించాలని కోరారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఎల్‌వోలు, బీజేపీ బీఎల్‌ఏ-2 ప్రతినిధులు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఓటరు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధికారిణి సుంకరి కవిత, మండల సీనియర్ నాయకులు ముత్యాల గౌడ్, బూత్ అధ్యక్షులు గంగా గౌడ్, బాగయ్య, లింగన్న తదితరులు పాల్గొన్నారు.