భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, జులై 2026, బుధవారంభారత్ సమాచార్

పనుల్లో నాణ్యతా లోపాలపై ఎమ్మెల్యే ఫైర్

WhatsApp Image 2026-07-21 at 6.57.04 PM

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వరకు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపడుతున్న జాతీయ రహదారి–65 విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపాల కారణంగా పనుల నాణ్యత దెబ్బతింటోందని ఆయన ఆరోపించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీహెచ్‌ఈఎల్ చౌరస్తా నుంచి రుద్రారం గణేష్‌గడ్డ వరకు చేపడుతున్న విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా విస్మరించబడ్డాయని అన్నారు. నిర్మించిన కొద్ది రోజులకే సర్వీస్ రోడ్లు దెబ్బతినడం, వర్షపు నీటి కాలువలు కూలిపోవడం పనుల నాణ్యతపై అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఇది కాంట్రాక్టర్ సంస్థలతో పాటు సంబంధిత అధికారుల పర్యవేక్షణలో ఉన్న లోపాలను ప్రతిబింబిస్తోందని విమర్శించారు.

రహదారి విస్తరణ సందర్భంగా వెలికితీసిన విలువైన మట్టిని ప్రజా అవసరాలకు వినియోగించకుండా ప్రైవేట్ సంస్థలకు తరలించడం కూడా తీవ్ర అభ్యంతరకరమని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అలాగే విస్తరణ పనుల్లో తొలగించిన మహనీయుల విగ్రహాలను పటాన్చెరు సాకి చెరువు కట్టపై ప్రతిష్ఠించాలని పలుమార్లు కోరినా స్పందించలేదని తెలిపారు. ఇప్పటివరకు 20కిపైగా సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పటికీ పనుల్లో ఆశించిన మార్పు కనిపించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వెంటనే మెరుగుపరచాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజల సొమ్ముతో చేపట్టే అభివృద్ధి పనుల్లో అవినీతి, నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. పనుల్లో మార్పు రాకపోతే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతానని తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల సంస్థ డీఈ సందీప్, కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.