భారత్ సమాచార్, తిరుపతి జిల్లా: భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి త్వరలో అరెస్ట్ కావడం ఖాయమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి భూ కబ్జా కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పలు అంశాలపై స్పందించారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నందుకే రాజకీయ కక్షతో తన భూములను స్వాధీనం చేసుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే రెవెన్యూ అధికారులు భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించినట్లు గుర్తించిన భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు తాము భూ కబ్జాలకు పాల్పడ్డారా లేదా అనే విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాలని ఆరణి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. హెరిటేజ్ సంస్థపై భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీతో రాజకీయాలు నిర్వహించే నాయకుడని ఆయన పేర్కొన్నారు.
తాను విలువలతో జీవిస్తున్నానని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పుకోవడం తప్ప తిరుపతి ప్రజలు ఎవరూ ఆ విషయాన్ని విశ్వసించడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. తిరుపతి అభివృద్ధి, ప్రజల ప్రయోజనాల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో కూడా ప్రభుత్వం వద్దకు విజిలెన్స్ నివేదిక అందిందని, ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలపై త్వరలో చర్యలు ఉంటాయని ఆరణి శ్రీనివాసులు అన్నారు. 2021 ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల నమోదు వ్యవహారంలో కూడా సిట్ ద్వారా విచారణ కొనసాగుతోందని, ఇందులోనూ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవేంకటేశ్వర స్వామికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని, ఆయనపై భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అక్కసుతో కూడినవని ఎమ్మెల్యే విమర్శించారు. టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతోనే బీఆర్ నాయుడుపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతో అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు.