భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, జులై 2026, శుక్రవారంభారత్ సమాచార్

లాఠీలతో కాదు… న్యాయంతో పాలించండి

035124a6-d140-4bdb-ba14-f37f4a82abaf

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష వ్యవహారంపై విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనల సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడం, నిరసనకారులను అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, దళితరత్న డా. ఏర్పుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్‌లో గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.

నీట్ పరీక్షల వ్యవహారంలో విద్యార్థులకు జరిగిన అన్యాయంపై, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం యువత చేస్తున్న శాంతియుత పోరాటాన్ని అణచివేతతో ఎదుర్కోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరసనల సందర్భంగా పోలీసుల బలప్రయోగంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటీవలి నిరసనల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయని గుర్తు చేశారు.

ప్రజా ఉద్యమాలకు సంఘీభావంగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డా. ఏర్పుల శ్రీనివాస్ కోరారు. ఆయనతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని, యువత ఆవేదనను అర్థం చేసుకుని వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, ఆ హక్కును అణచివేయకుండా ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ యువత ఆశయాలను గౌరవిస్తూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ స్థాపించిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రజాస్వామ్య, చట్టబద్ధ ఉద్యమాలకు పూర్తి మద్దతు ఉంటుందని దళితరత్న డా. ఏర్పుల శ్రీనివాస్ తెలిపారు.