భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 26న జరగనున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మనోహరాబాద్ మండలంలోని యాదవ సంఘాల నాయకులకు శుక్రవారం ఆహ్వాన పత్రికలు అందజేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎం. రఘునందన్ రావు ఆదేశాల మేరకు బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్, మనోహరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ యాదవ సంఘాల ప్రతినిధులను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నత్తి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం సిద్దిపేట జిల్లా ప్రజలతో పాటు శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తుల దశాబ్దాల కలను సాకారం చేసే చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల భక్తులు, స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు.
రైల్వే స్టేషన్ ప్రారంభంతో ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని, వాణిజ్యం, పర్యాటకం, భక్తుల రాకపోకలు మరింత పెరుగుతాయని ఆయన అన్నారు. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో యాదవ సంఘాల నాయకులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు యాదవ్, కొల్తూరి నరేష్ గౌడ్, ఆనంద్ యాదవ్, నవీన్ యాదవ్, లింగం రాజు, గణేష్ యాదవ్, సందీప్ రామస్వామి, బీజేపీ కార్యకర్తలు, యాదవ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.