భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, జులై 2026, శనివారంభారత్ సమాచార్

మౌలిక సదుపాయాల కోసం సీఐటీయూ సంతకాల సేకరణ

c93c048f-8527-4bc3-9f4a-a90b1fe3e48d

భారత్ సమాచార్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: రాంపల్లి పారిశ్రామిక ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) కీసర మండల కమిటీ ఆధ్వర్యంలో జూలై 25 నుంచి ఆగస్టు 1, 2026 వరకు వారంరోజుల పాటు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, కంపెనీ యాజమాన్యాలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ పిలుపునిచ్చింది.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని రాంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకు 2000 సంవత్సరంలో 45 ఎకరాల భూమిని కేటాయించి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఆధ్వర్యంలో పారిశ్రామిక క్లస్టర్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినప్పటికీ ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధి నిలిచిపోయిందని సీఐటీయూ పేర్కొంది. పారిశ్రామిక ప్రాంతాల నుంచి ప్రభుత్వం భారీగా పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ వాటిలో కనీసం 35 నుంచి 50 శాతం నిధులను తిరిగి అదే ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేసింది.

రాంపల్లి పారిశ్రామిక ప్రాంతం ఈసీఐఎల్, చర్లపల్లి పరిశ్రమలు, పోచారం ఐటీ కారిడార్, ఇన్ఫోసిస్ ఎస్‌ఈజెడ్, రహేజా మైండ్‌స్పేస్ ఐటీ పార్క్‌లకు సమీపంలో ఉండటంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్, కరీంనగర్ జాతీయ రహదారులు, చర్లపల్లి రైల్వే టెర్మినల్, ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు దగ్గరగా ఉండటం వల్ల పరిశ్రమలు, ఐటీ, తయారీ, గిడ్డంగుల రంగాలకు అత్యంత అనుకూల ప్రాంతంగా గుర్తింపు పొందిందని తెలిపింది. అయినప్పటికీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, విద్యుత్ సదుపాయాలు లేకపోవడం వల్ల పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.

వర్షాకాలంలో అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిని చెరువులను తలపిస్తున్నాయని, కార్మికులు నడవడానికే ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సంబంధిత శాఖలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, శాశ్వత డ్రైనేజీ, రక్షిత తాగునీటి సరఫరా, వీధి దీపాలు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, కంపెనీ యాజమాన్యాలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ కీసర మండల కమిటీ విజ్ఞప్తి చేసింది.