భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లాలో తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచుల చైతన్య సదస్సు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఓ ప్రైవేట్ గార్డెన్స్‌లో జరిగిన ఈ సమావేశానికి 18 మండలాలకు చెందిన సర్పంచులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జిల్లాలోని 482 గ్రామపంచాయతీలలో సుమారు 450 మంది సర్పంచులు పాల్గొని గ్రామపంచాయతీల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సర్పంచుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం రాజకీయాలకు అతీతంగా సర్పంచుల ఐక్యత కోసం నిర్వహించిన కార్యక్రమమని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచుల ఫోరం కన్వీనర్ గునిగంటి కమలాకర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే సర్పంచుల ఉద్యమ లక్ష్యమని అన్నారు. ఎన్నికైన తర్వాత ప్రతి సర్పంచ్ గ్రామాభివృద్ధి కోసం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సొంత నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు తగిన నిధులు విడుదల చేస్తే అభివృద్ధి పనులను మరింత సమర్థవంతంగా చేపట్టగలమన్నారు. సర్పంచుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు.
సమావేశంలో సర్పంచులు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అందుతున్న రూ.6,500 గౌరవ వేతనాన్ని రూ.20,000కు పెంచాలని, ఉపసర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేయాలని కోరారు. ప్రతి నెల జిల్లా కలెక్టర్‌తో సర్పంచుల సమావేశం నిర్వహించడంతో పాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని, పదవీకాలం ముగిసిన అనంతరం సర్పంచులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సర్పంచుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా సర్పంచులు ఐక్యతను కొనసాగిస్తూ రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే మంచి సర్పంచులుగా గుర్తింపు పొందడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.