భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, జులై 2026, మంగళవారంభారత్ సమాచార్

సమాజ సేవకు పూర్వ విద్యార్థుల సంకల్పం

WhatsApp Image 2026-07-27 at 6.31.10 PM (1)

 

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం మండల కేంద్రంలోని ఇంద్రసేన రెడ్డి ఫంక్షన్ హాల్‌లో 1999–2000 విద్యా సంవత్సరానికి చెందిన జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా సమావేశమై “ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ సర్వీస్ ఫర్ సొసైటీ” పేరుతో సేవా ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. తమ స్నేహబంధాన్ని సమాజ సేవకు అంకితం చేయాలనే సంకల్పంతో సభ్యులంతా ఏకగ్రీవంగా ట్రస్ట్ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలను విస్తరించి సమాజానికి ఉపయోగపడే విధంగా ట్రస్ట్‌ను నడపాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యా సహాయం, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, మొక్కల నాటకం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సహాయ సహకారాలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు వంటి ప్రజాహిత కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. ట్రస్ట్‌ను చట్టబద్ధంగా నమోదు చేసి పూర్తి పారదర్శకతతో సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని తీర్మానించారు.

ట్రస్ట్ నూతన చైర్మన్ అంతిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మహిళా వైస్ చైర్మన్ ఎస్. శ్వేత, వైస్ చైర్మన్ టి. భగవాన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బి. బ్రహ్మేందర్ గౌడ్ మాట్లాడుతూ, 1999–2000 బ్యాచ్ స్నేహాన్ని సేవా బంధంగా మార్చి సమాజానికి శాశ్వతంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడమే తమ లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంక్షేమ రంగాల్లో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ట్రస్ట్ సలహాదారులుగా డా. ఏర్పుల శ్రీనివాస్, గణేష్ సింగ్, జాయింట్ సెక్రటరీలుగా యు. మమత, పి. మహేష్, టి. నర్సింగరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా టి. మహేష్, ఎల్. అంజిరెడ్డి, ఎం. వీరేశం, కల్చరల్ సెక్రటరీలుగా ఎస్. ప్రవీణ్ కుమార్, వి. భాస్కర్, ట్రెజరర్‌గా పి. మమతతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిన్నారం పూర్వ విద్యార్థులు సమాజ సేవకు నూతన దిశగా అడుగులు వేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ట్రస్ట్ సభ్యులను అభినందించారు. వారి సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.