భారత్ సమాచార్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఈ నెల 18న ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
బాధితురాలు చేసిన ఫిర్యాదులో లైంగిక వేధింపులతో పాటు తన వ్యక్తిగత వీడియోలను భర్తకు పంపించి మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
విచారణలో భాగంగా నిందితుడు పేర్కొన్న రెండు చిరునామాల్లో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. అంతేకాకుండా ఆయన సెల్‌ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉదయ్ కృష్ణారెడ్డి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ శివారులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కేసు దర్యాప్తును పూర్తిగా పారదర్శకంగా కొనసాగిస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిని విచారించి కేసుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
వైద్య పరీక్షల్లో కీలక అంశాలు..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదైన రోజు అంటే జూలై 18న బాధితురాలికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
అలాగే బాధితురాలి చెంప భాగంలో కమిలిన గాయాలు, ఎడమ కాలిపై కూడా గాయం ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలు ప్రస్తుతం కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి. బుధవారం ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు హాజరుపరచనున్నట్లు సమాచారం.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత అజ్ఞాతంలోకి..
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఆయన కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఉదయ్ కృష్ణారెడ్డిని త్వరలో అరెస్ట్ చేస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఆయన కోసం హైదరాబాద్‌తో పాటు ఒంగోలు ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం జూలై 28న మిర్యాలగూడలో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారికంగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
క్వాష్ పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ
హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఉదయ్ కృష్ణారెడ్డి వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో విచారణకు ముందు ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించిన తదుపరి చర్యలు చేపడుతున్నారు. కోర్టు నిర్ణయం, దర్యాప్తు పురోగతిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.