భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, ఆగస్టు 2026, శనివారంభారత్ సమాచార్

పెద్ది సుదర్శన్ రెడ్డికి సీపీఐ ఘన నివాళి

6c29161b-9401-4b96-93f5-e19a72a9ad88

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో సీపీఐ నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన అంతిమయాత్రలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. విజయ్ సారధి, వరంగల్ జిల్లా కార్యదర్శి ఎస్.కె. బాసు మియా, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొని ఆయన భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంకితభావంతో పనిచేసిన నిజమైన ఉద్యమకారుడిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని గ్రామగ్రామానికీ తీసుకెళ్లడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలతో మమేకమై ఉద్యమ స్ఫూర్తిని విస్తృతంగా చాటిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయులని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండేవారని సీపీఐ నాయకులు గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ఆయన మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాజకీయాలకు తీవ్ర లోటని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో దండు లక్ష్మణ్, ఎండి అక్బర్, ఉరుసు రాజు, గోవర్ధనాచారి తదితర సీపీఐ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని నాయకులు పేర్కొన్నారు.