భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
సోమవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పురోగతి, ప్రజా సమస్యలు, మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులను కూడా వినియోగించనున్నట్లు తెలిపారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నందిగామ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయితే రాబోయే పది రోజుల్లో ప్రారంభోత్సవం నిర్వహిస్తామని, దీని ద్వారా గ్రామపంచాయతీకి ప్రతినెల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. భానూరు, క్యాసారం, నందిగామ గ్రామపంచాయతీల పరిధిలో నిధులకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
గుమ్మడిదల మండలంలోని అనంతారం, కానుకుంట, నూతనకల్, కొత్తపల్లి తదితర గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి హ్యామ్ ద్వారా నిధులు మంజూరయ్యాయని పీఆర్ డీఈ దీపక్ తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. టెండర్లు పూర్తయినప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఎంపీడీవోలు యాదగిరి, ఉమాదేవి, పీఆర్ డీఈ దీపక్, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, ఏఈ శశిధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.