భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, ఆగస్టు 2026, శనివారంభారత్ సమాచార్

చికిత్స పొందుతూ యువకుడు మృతి

02f31aca-c198-4060-b30c-51730e02bb00

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో బాల్యాన్ని గడిపి విద్యాభ్యాసం చేసిన పంజాల శ్రీధర్ గౌడ్ (32) ఇక లేరు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బాల్య స్నేహితులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదం నెలకొంది. “మిత్రమా.. నీ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేం” అంటూ క్లాస్‌మెంట్స్, చిన్ననాటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన శ్రీధర్ గౌడ్.. చిన్నతనంలోనే కోమటిపల్లి గ్రామంలోని తన పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ స్థానిక పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఈ క్రమంలో గ్రామంలోని ఎంతోమందితో ఆయనకు అనుబంధం ఏర్పడింది. చదువుకున్న రోజుల్లోనే స్నేహితులతో కలిసిమెలిసి ఉండే శ్రీధర్ గౌడ్ అందరి మన్ననలు పొందారు.

విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం తన స్వగ్రామమైన బొల్లికొండకు వెళ్లి కుటుంబ బాధ్యతలు చేపట్టారు. తన గౌడ వృత్తిలో కొనసాగుతూ వివాహం చేసుకున్నారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. కోమటిపల్లి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఎప్పుడూ మరిచిపోలేదు.

గ్రామంలోని స్నేహితులు, పరిచయస్తులతో నిత్యం ఆప్యాయంగా మాట్లాడుతూ, అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. ఎవరితోనైనా ఎంతో మర్యాదగా, ఆప్యాయంగా మెలిగే స్వభావం శ్రీధర్ గౌడ్‌దని గుర్తు చేసుకున్నారు.

ఇటీవల అనారోగ్యానికి గురైన శ్రీధర్ గౌడ్ హనుమకొండలోని శ్రీ బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

చిన్న వయసులోనే మంచి మనసున్న స్నేహితుడిని కోల్పోయామని బాల్య మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పైండ్ల అనిల్ కుమార్‌తో పాటు పలువురు స్నేహితులు, గ్రామస్తులు శ్రీధర్ గౌడ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే చురుకైన వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు.