భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, ఆగస్టు 2026, మంగళవారంభారత్ సమాచార్

గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో

cd75cc1f-68f0-459e-af31-38511358ef8f

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న జైల్ భరో కార్యక్రమంలో భాగంగా గుమ్మడిదల మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం భారీ రాస్తారోకో నిర్వహించారు. బొంతపల్లి కమాన్ సమీపంలోని ప్రధాన రహదారిపై చేపట్టిన ఈ నిరసనతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే. రాజయ్య మాట్లాడుతూ దేశానికి మంచి భవిష్యత్తు కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మికులు, ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కొద్దిమంది వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశాన్ని ప్రశ్నించే, ప్రజా సమస్యలపై పోరాడే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం సరికాదన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కార్మికులు, రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజయ్య విమర్శించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లు, విత్తన చట్టం వంటి ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరారు. దేశంలో ధరలు, నిరుద్యోగం పెరుగుతున్నాయని, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు.

ప్రజా సమస్యలపై మరింత పెద్దఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు శ్రీధర్ రావు, భాస్కర్ రెడ్డి, నాయకులు కమ్మరి రవీందర్ చారి, వెంకటేశ్వర్లు, జగన్ రెడ్డి, ఫకీర్, శ్రీరాములు, మహమ్మద్, వాసుదేవరావు, శ్రీనివాసరావు, అప్పారావు, వీరభద్రం, ఆనంద్ రెడ్డి, గౌసోద్దీన్, నర్సింలు తదితరులతో పాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.