భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, ఆగస్టు 2026, శనివారంభారత్ సమాచార్

సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి సభను విజయవంతం చేయాలి

5040957d-f2b3-4c20-b377-bafec0421d93

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ప్రాంతంలో పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణా గార్డెన్స్‌లో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డికి చేరుకుని, 2:30 గంటల నుంచి 3:35 గంటల వరకు ప్రధాన బహిరంగ సభ, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సంగారెడ్డిలో శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, పార్టీ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి సంగారెడ్డి సభను విజయవంతం చేయాలని ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.