భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సింగరేణి బొగ్గు గనుల పురిటిగడ్డగా పేరొందిన ఇల్లందు ప్రాంతానికి ప్యాసింజర్ రైలు సేవలను పునరుద్ధరించాలని, రైల్వే మార్గాన్ని రామగుండం వరకు విస్తరించాలని కోరుతూ గత జూన్ 6న ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు సమర్పించిన వినతి పత్రానికి సానుకూల స్పందన లభించిందని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డి.వై. గిరి తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తమ ప్రతిపాదనలపై రైల్వే శాఖ వేగంగా స్పందించడం పట్ల డి.వై. గిరి హర్షం వ్యక్తం చేశారు. తొలి దశలో కారేపల్లి నుంచి ఇల్లందు వరకు రైల్వే మార్గం, స్టేషన్ మౌలిక వసతుల పునరుద్ధరణ పనులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే నిజాం కాలంలో విజయవాడ–డోర్నకల్ మీదుగా ఇల్లందుకు ప్యాసింజర్ రైళ్లు నడిచిన చారిత్రక నేపథ్యం ఉందని గుర్తుచేశారు. కాలక్రమేణా నిలిచిపోయిన రైలు సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇల్లందు ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
అదేవిధంగా కారేపల్లి–ఇల్లందు రైల్వే పనులతో ఆగిపోకుండా, ఇల్లందు నుంచి నర్సంపేట, ములుగు, మేడారం, భూపాలపల్లి మీదుగా నేరుగా రామగుండం లేదా మంచిర్యాల వరకు రైల్వే మార్గాన్ని విస్తరించాలని డి.వై. గిరి డిమాండ్ చేశారు. ఈ మార్గాన్ని ‘మహా సింగరేణి రైల్వే కారిడార్’గా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాజీపేట జంక్షన్‌పై రైళ్ల రద్దీ తగ్గడంతో పాటు విజయవాడ–దిల్లీ మార్గానికి ప్రత్యామ్నాయ షార్ట్‌కట్ బైపాస్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రయాణికుల ప్రయాణ సమయం సుమారు మూడు గంటల వరకు ఆదా కావచ్చని వివరించారు.
ముఖ్యంగా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే దేశవ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని డి.వై. గిరి పేర్కొన్నారు. ఇల్లందు ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి కూడా ఈ రైల్వే కారిడార్ కీలకంగా మారుతుందని అన్నారు. రైల్వే ప్రాజెక్టు సాధన దిశగా చొరవ చూపిన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌కు తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.