భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, ఆగస్టు 2026, ఆదివారంభారత్ సమాచార్

ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పెద్దపీట: CM రేవంత్ రెడ్డి

490a0306-182d-4c42-9e7b-fa50d67f517c

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా వేదికగా నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి వేలాదిగా మహిళలు తరలిరాగా, వారిని ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ రేషన్ వ్యవస్థను తీసుకొచ్చిందని అన్నారు. ప్రస్తుతం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ప్లాస్టిక్ కార్డు లేదా ఉచిత బియ్యం పొందేందుకు ఉపయోగించే కార్డు మాత్రమే కాదని పేర్కొన్నారు. మెదక్ ఎంపీగా గెలిచిన ఇందిరాగాంధీ ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేశారని గుర్తుచేస్తూ, ఆమె ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మంది ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రైతులు పండించిన పంటకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ, అదనంగా రూ.2,000 పెంచి రైతు భరోసా పేరుతో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని వెల్లడించారు. ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేశామని, దేశంలోనే అప్పులు లేని రైతులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. గత 32 నెలల్లో రైతుల సంక్షేమం కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, అక్కాచెల్లెళ్లకు పాలపిట్ట చీరలను అందించామని తెలిపారు. రాష్ట్రంలో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరుతోనే మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై సీఎం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా, బొరుసులాంటివని, పేదవాడి ఆకలి తీర్చడంపై అవి ఏనాడూ దృష్టి పెట్టలేదని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసురుతూ ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చకు సిద్ధం కావాలని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిన గ్రామాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు అడిగితే, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని, అక్కడ బీఆర్‌ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు నష్టపోవాలని ప్రతిపక్ష నేతలు అఘోరా పూజలు, చేతబడులు చేయిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి శవాల పునాదులపై అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే, విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం 2034 వరకు తమ ప్రభుత్వానికి ఉండాలని సీఎం కోరారు.