భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. శనివారం మాటేగాం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు.
విచారణలో నిందితులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని ఏఎస్పీ తెలిపారు. లోకేశ్వరం మండలం రాయ్‌పూర్ కాండ్లిలో ఒక ఇంటితో పాటు రెండు ఆలయాల్లో, మన్మద్ గ్రామంలో రెండు ఇళ్లు, నాలుగు ఆలయాల్లో, దిలావర్‌పూర్ మండలంలో రెండు ఇళ్లలో, నర్సాపూర్‌లో రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. భైంసా మండలం పెండపెల్లిలోని ఒక ఆలయం, బెల్ట్ షాపు, రెండు ఇళ్లు, తిమ్మాపూర్‌లో ఒక ఇల్లు, హంపోలిలో ఒక ఇంట్లో కూడా చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.
అదేవిధంగా బిజ్జూర్, దేగాం గ్రామాల్లోని ఒక్కో ఆలయంలో జరిగిన చోరీల్లోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఏఎస్పీ సాయికిరణ్ వెల్లడించారు. ఏడ్బిడ్ గ్రామానికి చెందిన పెద్ద సాయన్న, బ్రహ్మన్‌గావ్‌కు చెందిన భూమేష్, గంగన్న, నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన పండరి, కుమార్ అనే ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. చోరీ చేసిన సొత్తును రహస్య ప్రదేశంలో దాచిపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.5 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. వరుస చోరీల కేసులను ఛేదించడంలో చురుకుగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.