భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, ఆగస్టు 2026, మంగళవారంభారత్ సమాచార్

ఏసీబీ వలకు చిక్కిన అధికారులు

18db0c5e-63d5-4f69-a3bc-f7d21a41e615

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి జిల్లా స్థాయి అధికారి డీసీటీఓ గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.

మంచిర్యాల పట్టణంలో ఓ వ్యాపారి జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించిన 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల రికార్డుల ఆడిట్‌లో అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు డీసీటీఓ గోదావరి రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ కూడా భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అనంతరం వ్యాపారి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. లంచంగా తీసుకుంటున్న రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మధు వెల్లడించారు. కేసుకు సంబంధించిన తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అరెస్టు చేసిన నిందితులను కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. లంచం సంబంధిత ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు.