భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

గొర్రెల పెంపకందారుల యువతకు 50% సబ్సిడీ ఫామ్స్ ఇవ్వాలి

50%సబ్సిడీపై గొర్రెల ఫామ్స్ కేటాయించాలి..            జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి అశోక్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడిన కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై గొర్రెల ఫామ్స్ కేటాయించి ఆదుకోవాలని జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. గొర్రెల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకోవాలనుకునే యువతకు ఆర్థిక సహకారం అందిస్తే వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

రాష్ట్ర సంఘం పిలుపు మేరకు, జిల్లా కమిటీ సూచనలతో జీఎంపీఎస్ ఇనుగుర్తి మండల అధ్యక్షుడు చిన్నాల కట్టమల్లు యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో గొర్రెల పెంపకందారుల స్థితిగతులపై సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొల్లం అశోక్ హాజరై గొర్రెల కాపరుల జీవన పరిస్థితులు, ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ గ్రామంలో యాదవ కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. ఆయా కుటుంబాలకు చెందిన యువత డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు లభించక నిరుద్యోగులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేకపోవడంతో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.

గొర్రెల పెంపకాన్ని వృత్తిగా చేపట్టాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేక చాలామంది యువత ముందుకు రాలేకపోతున్నారని తెలిపారు. మరోవైపు గొర్రెల మేతకు అవసరమైన పచ్చిక బయళ్లు, భూములు అందుబాటులో లేకపోవడం కూడా వృత్తిని కొనసాగించేందుకు అడ్డంకిగా మారిందన్నారు.

ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి గొర్రెల పెంపకంపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతకు 50 శాతం సబ్సిడీతో ఫామ్స్ కేటాయించాలని, అవసరమైన రుణాలు అందించి ఉపాధి కల్పించాలని బొల్లం అశోక్ కోరారు.

ఈ సర్వే కార్యక్రమంలో నర్ర సుధాకర్, రాజు, అనిల్, నరసింహ, నర్ర అశోక్, జక్కుల ఉపకర్, సురబోయిన యాకన్న, నర్ర నరేష్, కొట్టం అశోక్, అనిల్, శ్రీను, జక్కుల హరీష్, నర్ర వెంకన్న, యాకాంబ్రం, లింగన్న తదితరులు పాల్గొన్నారు.