భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామంలో తాను సర్పంచిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పించాలని కోరుతూ హేమ్లతండ మాజీ సర్పంచి బానోతు వీరన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో ఆయన ఈ ఫిర్యాదును సమర్పించారు.
తాను సర్పంచిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో హేమ్లతండ అభివృద్ధి కోసం పలు పనులు చేపట్టానని, అయితే వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని వీరన్న తన వినతిలో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రస్తుత సర్పంచి గుగులోతు అరుణ భాస్కర్‌ను పలుమార్లు అడిగినా స్పందన లేదని ఆరోపించారు. బిల్లులు ఇవ్వాలని కోరితే.. “మీకు ఇవ్వమని, ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ స్పష్టంగా చెప్పినట్లు ఫిర్యాదులో వివరించారు.
ఈ సమస్యను మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వీరన్న పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత సర్పంచి అరుణ భాస్కర్ పనులు చేపట్టకుండానే MBలు చేయించుకుని బిల్లులు డ్రా చేస్తున్నారని వార్డు సభ్యులు సెప్టెంబర్ 28న ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు విచారణ జరగలేదని కలెక్టర్‌కు అందించిన వినతిపత్రంలో ఆరోపించారు.
ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, తాను చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచి బానోతు వీరన్న కలెక్టర్‌ను కోరారు. ఆయన వెంట వార్డు సభ్యుడు బానోతు సంపత్ ఉన్నారు.