భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి మొత్తం ఏడు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ వెల్లడించారు.
ఎంపీడీవో కుమార్తో పాటు 28 శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన వినతులను స్వీకరించారు. అనంతరం అందిన దరఖాస్తుల వివరాలను ఎంపీడీవో వెల్లడించారు.
మొత్తం ఏడు దరఖాస్తుల్లో హౌసింగ్ సమస్యలకు సంబంధించి మూడు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఒకటి, రెవెన్యూ సమస్యపై ఒకటి, ఇరిగేషన్ సమస్యపై ఒకటి, అటవీ శాఖకు సంబంధించిన సమస్యపై మరొకటి వచ్చినట్లు తెలిపారు.
ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు హాజరవుతున్నందున ప్రజలు తమ సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.