భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పుస్తకాల్లో చదువుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వాటిపై పూర్తి అవగాహన పెంచుకునే ఉద్దేశంతో మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చేగుంటలోని చౌక ధరల దుకాణాన్ని సందర్శించి రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా రేషన్ షాపు ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న బియ్యం వివరాలను విద్యార్థులు తెలుసుకున్నారు. ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయి? వాటి ఆధారంగా ఎలాంటి సరుకులు పంపిణీ చేస్తున్నారు? లబ్ధిదారులకు ఏ సమయాల్లో రేషన్ అందిస్తున్నారు? అనే అంశాలపై రేషన్ డీలర్ శ్రీనివాస్‌ను ప్రశ్నించి వివరాలు సేకరించారు.
రేషన్ పంపిణీ విధానం, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల గురించి డీలర్ విద్యార్థులకు వివరించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటన ద్వారా విద్యార్థులకు ప్రభుత్వ ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రత్యక్ష అవగాహన కలిగింది.
ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్, రమ, విద్యార్థులు పాల్గొన్నారు.