భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ గంటల తరబడి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకునే విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. విద్యార్థుల సౌకర్యార్థం మెదక్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను బుధవారం ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఎస్. రాజు ప్రారంభించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో పలువురు నిరుద్యోగ యువతీ యువకులు గ్రంథాలయంలో ప్రతిరోజూ గంటల తరబడి చదువుకుంటున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రాంగణంలోనే తాగునీరు పొందేందుకు ఈ ప్లాంట్ ఉపయోగపడనుంది.
మరోవైపు నీటి సంరక్షణకు కూడా ఈ ఏర్పాట్లలో ప్రాధాన్యత ఇచ్చారు. మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి వెలువడే వ్యర్థ నీటిని వృథా కాకుండా వినియోగించుకునేలా ప్రత్యేక విధానం ఏర్పాటు చేశారు. మొదట ఆ నీటిని చేతులు కడుక్కోవడానికి ఉపయోగించి, అనంతరం గ్రంథాలయ ప్రాంగణంలోని మొక్కలకు మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా నీటి వృథాను అరికట్టడంతో పాటు పచ్చదనాన్ని కాపాడేందుకు కూడా అవకాశం కల్పించారు.
విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, నీటి పొదుపుపై దృష్టి సారిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.