భారత్ సమాచార్, జాతీయం: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2026 నవంబర్ 1 నుంచి ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన BS6 కంటే తక్కువ ఉద్గార ప్రమాణాలు కలిగిన పెట్రోల్, డీజిల్ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలు జనవరి 31, 2027 వరకు కొనసాగనున్నాయి. BS6 ప్రమాణాలకు అనుగుణమైన వాహనాలతో పాటు CNG, ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపులు ఉన్నాయి. అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వంటి అత్యవసర సేవల వాహనాలకూ మినహాయింపు కల్పించారు. అయితే చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ తప్పనిసరి.
అయితే BS6 వాహనాలు అసలు కాలుష్యాన్ని విడుదల చేయవా అనే సందేహం చాలామందిలో ఉంది. నిజానికి ఏ పెట్రోల్ లేదా డీజిల్ వాహనం అయినా కొంతమేర ఉద్గారాలను విడుదల చేస్తుంది. కానీ BS6 వాహనాల్లో ఆధునిక కాలుష్య నియంత్రణ సాంకేతికతను ఉపయోగించడం వల్ల హానికరమైన వాయువుల తీవ్రత తగ్గుతుంది. డీజిల్ వాహనాల్లో డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (DPF) పొగలోని మసి కణాలను బంధిస్తుంది. సెలెక్టివ్ కాటలిటిక్ రిడక్షన్ (SCR) వ్యవస్థలో AdBlue ద్రవం సాయంతో నైట్రోజన్ ఆక్సైడ్లను తక్కువ హానికరమైన పదార్థాలుగా మారుస్తారు. పెట్రోల్ వాహనాల్లో క్యాటలిటిక్ కన్వర్టర్ కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ల వంటి కాలుష్య కారకాలను తగ్గిస్తుంది.
ఇక ఆన్‌బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD) వ్యవస్థ వాహనంలోని ఇంజిన్, కాలుష్య నియంత్రణ పరికరాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఏదైనా లోపం గుర్తిస్తే డాష్‌బోర్డ్‌పై హెచ్చరిక లైట్ వెలుగుతుంది. భారత్ స్టేజ్-6 (BS6) ఉద్గార ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త వాహనాలకు తప్పనిసరి అయ్యాయి. పాత BS4 ప్రమాణాలతో పోలిస్తే హానికరమైన ఉద్గారాలను మరింత కఠినంగా నియంత్రించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం.
అయితే BS6 వాహనాలు ఉన్నంత మాత్రాన కాలుష్యం పూర్తిగా తగ్గిపోదు. DPF ఫిల్టర్‌ను సక్రమంగా నిర్వహించకపోవడం, ఇంజిన్‌లో సమస్యలు ఉండటం, కాలుష్య నియంత్రణ పరికరాలు పనిచేయకపోవడం వల్ల ఉద్గారాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే వాహనాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం, PUC సర్టిఫికెట్‌ను అప్డేట్ చేసుకోవడం అవసరం. ఢిల్లీలో పాత వాహనాలపై ఆంక్షలు విధించడం వెనుక ప్రధాన ఉద్దేశం శీతాకాలంలో పెరిగే వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజారోగ్యాన్ని కాపాడటమే.