భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్‌.. !

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్‌.. !

భార‌త్ స‌మాచార్, అంత‌ర్జాతీయం : అమెరికా మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలించాయి. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అనూహ్య విజయాలు సాధించి కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్‌ రెండింటిపైనా ఆధిపత్యం సంపాదించింది. రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రాల్లోనూ డెమొక్రాట్లు పాగా వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితాలతో ట్రంప్‌ అధ్యక్ష పదవీకాలంలోని మిగిలిన రెండేళ్లు మరింత సవాళ్లతో నిండే అవకాశం కనిపిస్తోంది.

సెనేట్‌లో మొత్తం 100 స్థానాలకు గాను మెజారిటీకి 51 సీట్లు అవసరం. తాజా ఫలితాల ప్రకారం డెమొక్రాట్లు కనీసం 54 స్థానాలతో ఆధిక్యంలోకి వచ్చారు. రిపబ్లికన్ల నుంచి టెక్సాస్‌, నార్త్‌ కరోలినా, ఐయోవా, కాన్సాస్‌, మైనే, ఒహియో, సౌత్‌ కరోలినా రాష్ట్రాల్లో కీలక స్థానాలను డెమొక్రాట్లు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా టెక్సాస్‌లో జేమ్స్‌ తలారికో విజయం, నార్త్‌ కరోలినాలో రాయ్‌ కూపర్‌ గెలుపు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రతినిధుల సభలోనూ డెమొక్రాట్లు మెజారిటీ మార్కును దాటారు. మొత్తం 435 స్థానాలున్న హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో 218 సీట్లు మెజారిటీకి అవసరం. అంతేకాకుండా టెక్సాస్‌, ఐయోవా, ఒహియో, జార్జియా వంటి రాష్ట్రాల్లో గవర్నర్‌ పదవులను కూడా డెమొక్రాట్లు దక్కించుకున్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలోనూ ఆ పార్టీ బలం పెరిగింది.

ఈ పరిణామం ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపనుంది. కొత్త చట్టాల ఆమోదం, బడ్జెట్‌ ప్రతిపాదనలు, కీలక నియామకాల విషయంలో డెమొక్రాట్ల మద్దతు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ పనితీరుపై విచారణలు, పర్యవేక్షణకు ప్రతిపక్షానికి అవకాశం పెరుగుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్రంప్‌ స్పందనలు, రిపబ్లికన్ల ఓటమిపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. మొత్తంగా ఈ ఫలితాలు అమెరికా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీశాయి.