భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

బంగారం కొనుగోళ్లకు బ్రేక్‌.. ఆరేళ్ల కనిష్టానికి డిమాండ్‌!

బంగారం కొనుగోళ్లకు బ్రేక్‌.. ఆరేళ్ల కనిష్టానికి డిమాండ్‌!

భార‌త్ స‌మాచార్, వాణిజ్యం : భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అభిమానం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలతో పాటు పెట్టుబడుల కోసం కూడా పసిడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు కొనుగోలుదారులపై భారంగా మారడంతో దేశంలో పసిడి డిమాండ్‌ తగ్గుతోంది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (WGC) అంచనా ప్రకారం.. 2026లో భారత్‌లో బంగారం డిమాండ్‌ సుమారు 650 టన్నులకు పరిమితం కావచ్చు. ఇదే జరిగితే కరోనా ప్రభావం ఉన్న 2020 తర్వాత అత్యల్ప స్థాయిగా నిలవనుంది.

డబ్ల్యూజీసీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు జరిగిన మూడో త్రైమాసికంలో దేశీయ బంగారం డిమాండ్‌ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 29 శాతం తగ్గి 162.5 టన్నులకు చేరింది. ఆభరణాల కొనుగోళ్లు 20 శాతం తగ్గి 99.9 టన్నులుగా నమోదయ్యాయి. బంగారు కడ్డీలు, నాణేల రూపంలో పెట్టుబడి డిమాండ్‌ 40 శాతం క్షీణించి 55 టన్నులకు పరిమితమైంది. ధరలు పెరిగినప్పటికీ బంగారం కోసం వినియోగదారులు వెచ్చించిన మొత్తం మాత్రం పెరగడం గమనార్హం.

డిమాండ్‌ తగ్గడానికి ప్రధాన కారణం ధరల పెరుగుదలే. 2026 మూడో త్రైమాసికంలో దేశీయ బంగారం సగటు ధర గత ఏడాదితో పోలిస్తే సుమారు 45 శాతం అధికంగా ఉంది. దీంతో కొనుగోలుదారులు తక్కువ బరువున్న ఆభరణాలు, తక్కువ క్యారెట్ల బంగారంపై దృష్టి పెడుతున్నారు. మరోవైపు బలహీనమైన రుతుపవనాలు వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ ఆదాయాలపై ప్రభావం చూపాయి. ఇరాన్‌ యుద్ధ పరిణామాల నేపథ్యంలో పెరిగిన జీవన వ్యయాలు కూడా కుటుంబాల కొనుగోలు శక్తిని తగ్గించాయి.

అయితే దీపావళి, ధనత్రయోదశి, వివాహాల సీజన్‌ కారణంగా డిసెంబర్‌ త్రైమాసికంలో కొనుగోళ్లు కొంత పుంజుకునే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ అంచనా వేస్తోంది. ధరలు తగ్గితే వాయిదా వేసిన కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ అధిక ధరలు, గ్రామీణ ఆర్థిక పరిస్థితులు డిమాండ్‌ పెరుగుదలకు పరిమితులు విధించవచ్చు. మొత్తంగా పసిడిపై భారతీయుల ఆసక్తి కొనసాగుతున్నప్పటికీ, ధరల కారణంగా కొనుగోలు చేసే పరిమాణం తగ్గుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.