భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

38 ఏళ్ల వయసులోనూ కింగ్ కోహ్లీకి ఐదు భారీ టార్గెట్లు..

38 ఏళ్ల వయసులోనూ కింగ్ కోహ్లీకి ఐదు భారీ టార్గెట్లు..

భార‌త్ స‌మాచార్, స్పోర్ట్స్ : భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ నవంబర్ 5న తన 38వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ రన్ మెషీన్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి పెట్టిన కోహ్లీ.. తన కెరీర్‌లో మరికొన్ని అరుదైన ఘనతలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును సమం చేయడం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. అయితే ఈ లక్ష్యాలన్నీ అతడి మిగిలిన క్రికెట్ కెరీర్‌పై ఆధారపడి ఉన్నాయి.

మొదటగా వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించడం కోహ్లీ ముందున్న అరుదైన లక్ష్యం. ఇప్పటివరకు 318 వన్డేలు ఆడిన అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 పరుగులు. 2012లో పాకిస్థాన్‌పై ఈ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. టెస్టుల్లో ఏడు డబుల్ సెంచరీలు సాధించినప్పటికీ వన్డేల్లో మాత్రం ఈ ఘనత అందుకోలేదు. మరోవైపు అతడి ప్రస్తుత వన్డే బ్యాటింగ్ సగటు 58.85గా ఉంది. దీనిని 60కు చేర్చడం కూడా మరో సవాలుగా మారింది.

ఇక వన్డేల్లో 18 వేల పరుగుల మైలురాయి మరో భారీ లక్ష్యం. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 15,183 పరుగులు ఉన్నాయి. ఈ మార్కును చేరుకోవాలంటే మరో 2,817 పరుగులు చేయాలి. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (18,426) రికార్డుకు చేరువ కావాలంటే ఇంకా ఎక్కువ పరుగులు సాధించాల్సి ఉంటుంది. 2027 ప్రపంచకప్‌లో భారత జట్టుతో కలిసి మరోసారి విశ్వవిజయం సాధించడం కూడా కోహ్లీ అభిమానుల ఆకాంక్ష. 2011లో ప్రపంచకప్ గెలిచిన కోహ్లీకి మరోసారి ఆ ట్రోఫీని అందుకునే అవకాశం దక్కుతుందా అనేది ఆసక్తికరం.

అన్నింటికంటే ఆసక్తికరమైనది సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు. కోహ్లీ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లు కలిపి 86 సెంచరీలు సాధించాడు. ఇందులో టెస్టుల్లో 30, వన్డేల్లో 55, టీ20ల్లో ఒక సెంచరీ ఉన్నాయి. సచిన్ రికార్డును సమం చేయాలంటే మరో 14 సెంచరీలు అవసరం. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్న నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. అయితే కోహ్లీ గత కొంతకాలంగా చూపిస్తున్న ఫామ్ అభిమానుల్లో ఆశలు పెంచుతోంది. ఈ ఐదు లక్ష్యాల్లో ఎన్ని సాధిస్తాడో చూడాలి.