భారత్ సమాచార్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిత్యం మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మెట్రో-ఆర్టీసీ కామన్ ట్రావెల్ పాస్ ధరలను భారీగా తగ్గించింది. ప్రయాణ ఖర్చులను తగ్గించి ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలకు దీపావళి కానుకగా అభివర్ణించారు. తగ్గించిన ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇప్పటివరకు రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి పాస్ ధరను ప్రభుత్వం రూ.4,000కు తగ్గించింది. అంటే ప్రయాణికులకు నెలకు రూ.4,500 ఆదా కానుంది. కొత్త పాస్‌లో మెట్రో ప్రయాణానికి రూ.3,000, ఆర్టీసీ బస్సుల కోసం రూ.1,000 కేటాయించారు. ఈ పాస్‌తో నెలలో గరిష్ఠంగా 50 మెట్రో సింగిల్ ట్రిప్పులు చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో మాత్రం ప్రయాణాల సంఖ్యపై పరిమితి ఉండదని ప్రకటించారు.
రోజువారీ ప్రయాణికులకు కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో రూ.400గా ఉన్న ఒకరోజు కామన్ పాస్ ధరను రూ.275కు తగ్గించింది. ఇందులో మెట్రో ప్రయాణానికి రూ.200, ఆర్టీసీ సేవలకు రూ.75 కేటాయించారు. ఈ పాస్ ద్వారా రోజుకు నాలుగు సింగిల్ జర్నీలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రోజువారీ పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా కానుంది.
గతంలో ఉమ్మడి పాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు ప్రయాణికుల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ధరలను సవరించి సామాన్యులు, ఉద్యోగులు, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. మెట్రో, బస్సు సేవలను ఒకే పాస్‌తో వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణం మరింత సులభం కానుంది. కొత్త ధరలు అమల్లోకి వస్తే హైదరాబాద్‌లో నిత్యం ప్రజా రవాణాపై ఆధారపడే వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుంది.