భారత్ సమాచార్, ఉద్యోగం : భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ (CEN) 09/2026 ద్వారా 191 ఐసొలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఏడు రకాల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ), స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఇందులో ఉన్నాయి.
పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. చీఫ్ లా అసిస్టెంట్‌కు 17, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు 21, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌కు 8, జూనియర్ ట్రాన్స్‌లేటర్‌కు 79, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్‌కు 27, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 3, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3కు 36 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతలు పోస్టును బట్టి మారుతాయి. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, సంబంధిత డిప్లొమాలు, అనుభవం వంటి అర్హతలు అవసరం. వయోపరిమితి కూడా పోస్టును బట్టి 18 నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.19,900 నుంచి రూ.44,900 వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది. ఎంపిక ప్రక్రియలో సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), అవసరమైన పోస్టులకు ట్రాన్స్‌లేషన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఉంటాయి. దరఖాస్తు ఫీజు సాధారణ అభ్యర్థులకు రూ.500 కాగా, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.250గా నిర్ణయించారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక దరఖాస్తు వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ డిసెంబర్ 4, 2026. పరీక్ష ఫీజు చెల్లించేందుకు డిసెంబర్ 6 వరకు గడువు ఉంది. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు సంబంధిత పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించాలి.