భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

గ్లోబల్ మార్కెట్ల పతనానికి భారత్‌ చెక్‌..

గ్లోబల్ మార్కెట్ల పతనానికి భారత్‌ చెక్‌..

భార‌త్ స‌మాచార్, వాణిజ్యం : అమెరికా, ఆసియా మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ భారత స్టాక్‌ మార్కెట్లు మాత్రం అదరగొట్టాయి. విదేశీ పెట్టుబడుల రాక, ముడిచమురు ధరల తగ్గుదల, కంపెనీల మెరుగైన త్రైమాసిక ఫలితాలు దేశీయ సూచీలకు బలాన్నిచ్చాయి. దీంతో వరుసగా ఏడో సెషన్‌లోనూ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,718.01 పాయింట్లు (2.17 శాతం) పెరిగి 81,028.02 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 493.75 పాయింట్లు (2.01 శాతం) లాభపడి 25,030.35కు చేరింది. దీంతో నిఫ్టీ మరోసారి 25 వేల మార్కును దాటింది.

సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా 6.15 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లలోనూ భారీ కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ షేర్లకు మంచి డిమాండ్‌ కనిపించింది. అయితే ఈ ర్యాలీ అన్ని విభాగాలకూ విస్తరించలేదు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 స్వల్పంగా నష్టపోగా, స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 0.82 శాతం పడిపోయింది. మరోవైపు ఇండియా విక్స్‌ 13.35 శాతం పెరిగి 17.66కు చేరడం మార్కెట్లో ఒడుదొడుకుల భయాలు ఇంకా ఉన్నాయని సూచిస్తోంది.

దేశీయ మార్కెట్లకు ప్రధానంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు ఊతమిచ్చాయి. గురువారం ఒక్కరోజే ఎఫ్‌ఐఐలు దాదాపు రూ.14,975 కోట్ల విలువైన భారతీయ షేర్లను కొనుగోలు చేశారు. ఇది దాదాపు ఆరేళ్లలో అత్యధిక రోజువారీ నికర కొనుగోళ్లలో ఒకటిగా నిలిచింది. ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటం, అమెరికా బాండ్‌ రాబడులు తగ్గడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. అంతర్జాతీయంగా ఏఐ రంగ షేర్లలో అమ్మకాలు పెరగడంతో భారత మార్కెట్లపై వాటి ప్రభావం తక్కువగా ఉండటం కూడా కలిసొచ్చింది.

ఇక కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా సూచీలకు అండగా నిలిచాయి. రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఏకీకృత లాభం 25 శాతం పెరగడంతో ఆ కంపెనీ షేరు దూసుకెళ్లింది. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి సంస్థల షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి. ఇటీవలి పతనంతో నాణ్యమైన పెద్ద కంపెనీల షేర్లు ఆకర్షణీయ ధరలకు చేరడం కూడా కొనుగోళ్లకు కారణమైంది. అయితే మార్కెట్‌లో అనిశ్చితి పూర్తిగా తొలగిపోలేదని, పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.