భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

చిన్ననాగారంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి: సర్పంచి

చిన్ననాగారంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి                 ఎమ్మెల్యే మురళి నాయక్ కు వినతి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచి చెడుపాక సుజాత యాకయ్యతో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో రహదారి భద్రతను మెరుగుపరచడంతోపాటు రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మండల కేంద్రం ఇనుగుర్తికి శనివారం ఎమ్మెల్యే మురళి నాయక్ రావడంతో సర్పంచి, గ్రామ నాయకులు ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రధాన రహదారి మధ్యలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రహదారి మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే గ్రామానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని వారు తెలిపారు. ఇందులో భాగంగా డివైడర్లు నిర్మించడం వల్ల ఇరువైపులా ప్రయాణించే వాహనాలు నిర్దేశిత మార్గాల్లోనే వెళ్లేందుకు వీలుంటుందని వివరించారు. దీంతో వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించడంతోపాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పేరు అశోక్ గౌడ్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బైరు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకుడు నాయిని కొమరయ్య, వార్డు సభ్యులు నిడిగంటి చంద్రమౌళి, గుండాల మంగమ్మ ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.