భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

సివిల్స్ ఇంటర్వ్యూకు 2,526 మంది ఎంపిక..!

సివిల్స్ ఇంటర్వ్యూకు 2,526 మంది ఎంపిక..!

భార‌త్ స‌మాచార్, ఉద్యోగం : సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక ప్రకటన చేసింది. 2026 సివిల్స్ మెయిన్ పరీక్షల ఫలితాలను నవంబర్ 5న విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన 2,526 మంది అభ్యర్థులను తదుపరి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)కు ఎంపిక చేసింది. ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో రోల్ నంబర్ ఆధారంగా పరిశీలించుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 13,343 మంది అభ్యర్థులు ఆగస్టు 21 నుంచి 30 వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు.

ఈ ఏడాది సివిల్స్ నియామక ప్రక్రియలో మొత్తం 1,016 ఖాళీలు ఉన్నట్లు యూపీఎస్సీ గతంలో విడుదల చేసిన అధికారిక సమాచారంలో పేర్కొంది. వీటి ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌తో పాటు ఇతర గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాలు చేపట్టనున్నారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు నవంబర్ 11 నుంచి 25వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు ఆన్‌లైన్‌లో తమ వివరాలను సమర్పించాలి లేదా సవరించాలి. ఇప్పటికే వివరాలు ఇచ్చినవారు కూడా వాటిని పరిశీలించి తుది సమర్పణ చేయాలని కమిషన్ సూచించింది.

ఇక ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అభ్యర్థులు ఇంటర్వ్యూ షెడ్యూల్, ఈ-సమ్మన్ లెటర్ల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. వ్యక్తిత్వ పరీక్షలో అభ్యర్థుల ఆలోచనా విధానం, నిర్ణయ సామర్థ్యం, పరిపాలనా దృక్పథం వంటి అంశాలను పరిశీలిస్తారు. మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా తుది మెరిట్ జాబితా రూపొందించి సర్వీసులు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు కూడా ఇంటర్వ్యూ జాబితాలో తమకు అవకాశం దక్కడంతో తదుపరి దశకు సిద్ధమవుతున్నారు.