భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి వేడుకలు..

వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి వేడుకలు..

భార‌త్ స‌మాచార్, అంత‌ర్జాతీయం : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలతో కలిసి ఓవల్ ఆఫీస్‌లో సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించారు. నవంబర్ 6న జరిగిన ఈ కార్యక్రమంలో భారత అమెరికా సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికాలో భారత సంప్రదాయాలకు లభిస్తున్న గుర్తింపునకు ఈ వేడుక మరో ఉదాహరణగా నిలిచింది. భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ వేడుకల్లో భారతీయ టెక్ వ్యాపారవేత్త, GOQii వ్యవస్థాపకుడు విశాల్ గోండల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా ప్రతిని బహూకరించారు. అనంతరం ట్రంప్‌తో కలిసి దీపాలు వెలిగించారు. ఈ విషయాన్ని విశాల్ గోండల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు. హనుమాన్ చాలీసా ధైర్యం, భక్తి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య స్నేహబంధం మరింత బలపడాలని దీపాలు వెలిగించే సమయంలో ప్రార్థించినట్లు తెలిపారు. ప్రపంచ ప్రజలకు శాంతి, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించే సంప్రదాయం 2003లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ హయాంలో ప్రారంభమైంది. తొలినాళ్లలో వైట్‌హౌస్ సమీపంలోని ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌లో ఈ కార్యక్రమాలు నిర్వహించేవారు. 2009లో అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్ ఈస్ట్ రూమ్‌లో తొలిసారిగా స్వయంగా దీపం వెలిగించి ఈ వేడుకలకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చారు. అప్పటి నుంచి వివిధ అధ్యక్షుల హయాంలోనూ దీపావళి వేడుకలు కొనసాగుతున్నాయి.

ఈసారి జరిగిన కార్యక్రమంలో కెనడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు రూబీ ధల్లా, ఇతర భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తలు, ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ దీపం వెలిగించడం, భారతీయ వ్యాపారవేత్త హనుమాన్ చాలీసా అందించడం ఈ వేడుకల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై భారతీయ అమెరికన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.