భారత్ సమాచార్.నెట్, శ్రీకాకుళం: కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు మూడు వేర్వేరు కేసుల్లో ఐదుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి మొత్తం 84.81 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. మొదటి కేసులో, ఒడిశాలోని రాయఘడ జిల్లాకు చెందిన గంట జైశ్వా, స్వప్న బిబార్ అనే ఇద్దరు వ్యక్తులు 40.24 కిలోల గంజాయిని పలాస రైల్వే స్టేషన్‌కు బస్సులో తీసుకువస్తుండగా ఎస్సై ఆర్.నర్సింహమూర్తి తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరు మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతంలో అమ్మకం కోసం వెళ్తున్నారని, ఈ రవాణాకు వారికి రూ.20 వేలు ఇస్తామని చెప్పినట్లు సీఐ తెలిపారు.
రెండో కేసులో, చెన్నైకి చెందిన గాయత్రి అనీఫ్, సుభాష్ అనే అన్నాచెల్లెలు 28.86 కిలోల గంజాయిని తమిళనాడుకు తరలించే ప్రయత్నంలో రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మహిళల ద్వారా గంజాయిని రవాణా చేస్తే పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఈ పథకం రచించినట్లు వెల్లడించారు. వీరు ఒడిశాలోని పర్లాకిమిడి ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చారు.
మూడో కేసులో, ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన లలితమారి అనే మహిళ 15.71 కిలోల గంజాయిని తీసుకువెళ్తుండగా పలాస రైల్వే స్టేషన్ రోడ్డులో అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరులో అమ్మకం కోసం లలితమారికి గంజాయి ఇచ్చి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఈ మూడు కేసుల్లో పట్టుబడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
మరిన్ని కథనాలు
అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్లు: మంత్రి