భారత్ సమాచార్.నెట్, నిర్మల్ : జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని శోకంలో ముంచేసింది. గంజాల్ టోల్ ప్లాజాలో ఉద్యోగం చేస్తున్న కొప్పుల సాయన్న (35) విధి నిర్వహణకు వెళ్తుండగా మృత్యువాత పడ్డారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన సాయన్న, బంగల్‌పేట్ మహాలక్ష్మివాడలో నివసిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ స్కూల్ సమీపంలో అతని బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో, తలకు బలమైన గాయమైంది.
వెంటనే స్థానికులు అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ సాయన్న తుదిశ్వాస విడిచారు. నిరుపేద కుటుంబానికి చెందిన సాయన్న మృతితో కడ్తాల్, మహాలక్ష్మివాడ గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. టోల్ ప్లాజాలో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తాడనుకున్న తమ కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని కథనాలు :
బాసరలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పూజలు