భారత్ సమాచార్.నెట్, ఆదిలాబాద్ జిల్లా : బాధితులకు త్వరితగతిన న్యాయం చేసే విధంగా కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా పోలీసు వ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక మావల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ రికార్డులు, సిబ్బంది విధులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా, ఆర్థిక నేరాల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని, రాత్రి సమయాల్లో పటిష్టమైన గస్తీ నిర్వహిస్తూ బీట్ సిస్టమ్‌ను పక్కాగా అమలు చేయాలని సూచించారు.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది పూర్తి సంసిద్ధంగా ఉండాలన్నారు. వార్డు, గ్రామస్థాయిలో విపివో (VPO) విధానంపై దృష్టి సారించి, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఖచ్చితమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ కర్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు :
పలువురు డీజే నిర్వాహకులపై కేసు