భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిన్నారం మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరవధిక ధర్నాకు దిగారు. ఉదయం ఐదు గంటల నుంచి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో కార్మికులు విధులను పూర్తిగా బహిష్కరించారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, దసరా, దీపావళి పండుగల సమయంలోనూ కార్మికుల కుటుంబాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. జీతాలు సమయానికి అందక కార్మికులు పూర్తిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ జీవో ప్రకారం రూ.15,600 వేతనం చెల్లించాలని, పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక నిరాహార దీక్షలకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పి. నర్సింలు తదితరులు పాల్గొన్నారు.