భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: శాంతిభద్రతల నిర్వహణ, పోలీసు శాఖ బలోపేతం కోసం వాహనం అందజేసినట్టు పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. శాంతిభద్రతల నిర్వహణ, నేర నియంత్రణకు తోడ్పడేందుకు తన ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన బొలెరో నియో వాహనాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్ అందజేసినట్లు,గురువారం నంద్యాల జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లాంఛనప్రాయంగా జెండా ఊపి బొలెరో నియో వాహనాన్ని ప్రారంభించారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్ మాట్లాడుతూ ఈ వాహనం అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు వేగంగా సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజా భద్రతను మెరుగుపరచడం, పోలీసుశాఖను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ వాహనాన్ని అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ వాహనం ప్రత్యేకంగా పెట్రోలింగ్, మహిళలు, పిల్లల భద్రత, అత్యవసర కాల్స్‌కి స్పందన వంటి సేవల కోసం ఉపయోగించబడనుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రత కోసం అమలు చేస్తున్న శక్తి యాప్ సేవలకు అనుగుణంగా పాఠశాలలు, కళాశాలల వద్ద పెట్రోలింగ్, ఈవ్-టీజింగ్, లైంగిక వేధింపులు, బలవంతపు బాల్య వివాహాలు, గృహ హింస వంటి ఘటనల్లో పోలీసులు వెంటనే స్పందించేందుకు ఈ వాహనం కీలకంగా మారుతుందన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
20, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్