ఏకగ్రీవ గ్రామాలకు రూ.10లక్షల ఆఫర్
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి స్పష్టీకరణ
భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరువు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం గుమ్మడిదలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి పనులు జరిగి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందాలంటే గ్రామాలు ఏకగ్రీవం కావాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయిన ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు నా సొంతంగా ఆ గ్రామానికి అందిస్తామని తెలిపారు. పట్టణాలు గ్రామాలు సమానంగా ఎదగాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకమని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో రోడ్లు, చెరువులు, మౌలిక వసతులు, పబ్లిక్ సర్వీసెస్ వంటి అంశాల్లో ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయోజనాలు మరింత వేగంగా ప్రజలకు చేరేందుకు ఏకగ్రీవం ఉత్తమ మార్గమన్నారు.