భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

డ్రీమ్ ప్రాజెక్ట్ అక్కడే.. లక్ అంతా ఫ్యూచర్‌ సిటీదే

01JHZ264947F5BZZ7Z96GKGSWK

భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: డెక్కన్ డైమండ్ సిటీగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని 1590లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఆ తర్వాత మూడో నిజాం సికిందర్ జా 1800లో మూసీ నదికి ఉత్తరాన సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారు. 1990 లో సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందడం, మాదాపూర్ కేంద్రంగా ఐటీ అభివృద్ధి చెందడంతో దీన్ని నాటి నుంచి హైటెక్ సిటీగా పిలుస్తారు. హైదరాబాద్ నగరాన్ని మూడు ప్రాంతాలుగా పిలుస్తారు. అవి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయనున్న 4వ నగరమే భారత్ ఫ్యూచర్ సిటీ. దీనిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మసిటీ, ఫోర్త్ సిటీగా నామకరణం చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతుంది.

30వేల ఎకరాలు.. నాలుగు గ్రీన్ జోన్లు:
హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త నగరం ఏర్పాటు అవసరం ఉందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు సంకల్పించింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మించనున్న ఈ ఫ్యూచ‌ర్ సిటీని శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేల మధ్యలో ఈ న‌గ‌రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 30వేల ఎకరాల విస్తీర్ణంలో 56 రెవెన్యూ గ్రామాలను సిద్ధం చేశారు. ఈ మొత్తం నిర్వహణ పనులను ఫ్యూచ‌ర్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్నారు. ఫ్యూచ‌ర్ సిటీని మొత్తం నాలుగు విభాగాలుగా నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో నివాస, వాణిజ్య, పరిశ్రమలు, వినోదం, గ్రీన్ జోన్లుగా ఉండ‌నున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు మొత్తం 765 చదరపు కి.మీ.విస్తీర్ణం, 56 గ్రామాలు, మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ఫ్యూచర్ సిటీ లేదా ఫోర్త్ సిటీ ప్రధాన లక్ష్యం హైదరాబాద్ నగర విస్తరణలో భాగంగా పెరుగుతున్న జనాభా ఒత్తిడిని తగ్గించడంతోపాటు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం, కాలుష్య రహిత నగరంగా అంటే నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ నిర్మించడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నారు.

దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ:
సరిగ్గా 25ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ ఏర్పాటు జరిగింది. మాదాపూర్ కేంద్రంగా హైటెక్ సిటీ చుట్టూ ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయగా పెద్దఎత్తున అభివృద్ధి జరిగింది. అభివృద్ధి విస్తరణ భాగంగా నార్సింగి, కోకాపేట వైపు వరకు వెళ్లింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతాలు అన్నిట్లో కూడా భూముల లభ్యత తగ్గిపోయింది. పెద్దపెద్ద బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంపైన ఒత్తిడి తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ నగరానికి తూర్పు, దక్షిణం ప్రాంతాలకు విస్తరించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతోంది. ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ప్రత్యేక గుర్తింపు పొందనుంది.

ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్.. పెరగనున్న భూముల ధరలు:
ఫ్యూచర్ సిటీని మొత్తం మొత్తం నాలుగు విభాగాలుగా విభజించారు. అందులో ముఖ్యంగా నివాస, వాణిజ్య, పరిశ్రమలు, వినోదం, గ్రీన్ జోన్లుగా విభజన జరిగింది. భవిష్యత్తులో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో ఎమిషన్స్, పునరుత్పత్తి శక్తి వినియోగం, వ్యర్థ నిర్వహణలో వినూత్న విధానాలను అవలించనున్నారు. AI, లైఫ్‌సైన్సెస్, ఫిన్‌టెక్, స్మార్ట్ టెక్నాలజీ వంటి రంగాల కోసం ఈ స్మార్ట్ సిటీలో ప్రత్యేక ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు స్కిల్ యూనివర్సిటీ కూడా నిర్మించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఫ్యూచర్ సిటీలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ అయ్యేలా రోడ్లను నిర్మించనుంది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించనున్నారు. అలాగే సులభ కనెక్టివిటీ కోసం ఔటర్ రింగ్ రోడ్డు(ORR), దీంతో పాటు రీజినల్ రింగ్(RRR) రోడ్లు ఈ ప్రాంతం గుండా వెళుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ అతివేగంగా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 8వ, 9వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ-2047 పేరుతో ఇంటర్‌నేషనల్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది. ఈ సమ్మిట్‌లో దాదాపు 1300 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ గ్లోబల్ సమ్మిట్‌తో భూముల ధరలు అమాంతం పెరగనున్నాయి.

పెట్టుబడులకు స్వర్గధామంగా ఫ్యూచర్ సిటీ:
ఫ్యూచర్ సిటీలో గ్రీన్ సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇందులో పార్కులు, జాగింగ్ ట్రాక్స్, సైకిల్‌ట్రాక్, పిల్లల కోసం ఆటస్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో భవిష్యత్ అసవరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నారు. 40 ఫీట్, 33 ఫీట్ వెడల్పు రహదారులు. భూగర్భ విద్యుత్, డ్రైనేజ్ వ్యవస్థ. తాగునీటి కోసం ప్రత్యేక పైప్ లైన్‌లు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు. LED లైట్స్, వర్షపు నీటి సంరక్షణ కోసం స్పాంజ్ పాండ్స్ నిర్మాణం, సౌర శక్తితో పనిచేసే స్ట్రీట్ లైట్స్ ఈ సిటీ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ‘లైవ్, లెర్న్, వర్క్, ప్లే’ అనే కాన్సెప్ట్‌తో పరిశ్రమలు, పాఠశాలలు, ఆస్పత్రులు, పార్కులు, షాపింగ్ సెంటర్లు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. పచ్చదనం, స్థిరమైన అభివృద్ధిలో భాగంగా స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్టులు, జీరో డిశ్చార్జ్ వాటర్ సిస్టమ్స్, నీటి పునర్వినియోగం, సహజవనరుల సంరక్షణ ఉంటాయి. ఉద్యోగాలు, పెట్టుబడుల కింద లక్షల కొద్దీ ఉద్యోగాల సృష్టి, తెలంగాణను ఇన్నోవేషన్, పెట్టుబడులకు స్వర్గధామంగా ఫ్యూచర్ సిటీ కేంద్ర బిందువు కానుంది.

పారదర్శకత, కొనుగోలుదారులకు భద్రత:
ఇప్పటికే అమల్లో ఉన్న టీజీ ఐపాస్(iPASS) ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్, వేగవంతమైన అనుమతులు అందించారు. RERA నమోదు ద్వారా నిర్మాణాలకు సంబంధించిన పారదర్శకత, కొనుగోలుదారులకు భద్రత ఉండనుంది. HMDA ద్వారా పట్టణ ప్రణాళికా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలను నిర్మించనున్నారు. RRR ప్రాజెక్ట్‌తో రీజినల్ కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అలాగే రాష్ట్రప్రభుత్వం సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం ద్వారా నూతన స్మార్ట్ సిటీని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం, అనుమతులను వేగంగా ఇవ్వడం, సింగిల్ విండో విధానం ద్వారా పారదర్శకత పాటించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

భారతదేశ మొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ:
ఫ్యూచర్ సిటీ అనేది ప్రణాళికాబద్దమైన నగరం. మల్టీమోడల్ కనెక్టివిటీ. బస్సు, మెట్రోరైల్, మోడ్రన్ అర్బన్ ఎమినిటీస్, రేడియల్ రోడ్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్ వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మెట్రో రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌‌పేటలో ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) ఆఫీసుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా మున్సిపల్ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు వ్యవహరిస్తున్నారు. మొత్తం 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7మండలాల పరిధిలో 56గ్రామాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఏరియా నుంచి మినహాయించి, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కిందకు తీసుకొస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. భారత్ ఫ్యూచర్ సిటీ రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల పరిధిలో విస్తరించి ఉంది.

దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా GHMC:
మరోవైపు హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు విస్తరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విలీన ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో కలపనున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించనుంది.