భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

క్లినిక్‌లపై దాడులు.. 7 క్లినిక్‌లు, ల్యాబ్ సీజ్

15a78de8-4562-449c-b6db-10b56cf0b890

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: అనుమతికి మించి వైద్య చికిత్సలు అందిస్తున్న క్లినిక్‌లపై అధికారులు కొరడా ఝళిపించారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర, దౌల్తాబాద్ ప్రాంతాల్లో గురువారం వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్న ఏడు క్లినిక్‌లతో పాటు ఓ హెల్త్‌కేర్ ల్యాబ్‌ను సీజ్ చేసినట్లు డీఐఓ డాక్టర్ శశాంక్ దేశ్‌పాండే తెలిపారు.

మండల కేంద్రమైన హత్నూరలో మూడు, దౌల్తాబాద్‌లో నాలుగు క్లినిక్‌లను అధికారులు సీజ్ చేశారు. అలాగే హెల్త్‌కేర్ ల్యాబ్‌పై కూడా చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన దేవి క్లినిక్, ల్యాబ్‌కు జరిమానా విధించినట్లు డాక్టర్ శశాంక్ దేశ్‌పాండే వెల్లడించారు.

ఆర్ఎంపీలు, పీఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్సలు మాత్రమే అందించాల్సి ఉండగా.. తమ స్థాయికి మించి సెలైన్ పెట్టడం, ఇంజక్షన్లు ఇవ్వడం, ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం వంటి వైద్య సేవలు అందిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అనుమతి లేకుండా కొన్ని మెడికల్ షాపుల్లో మందులు విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించామని డీఐఓ తెలిపారు. దీనిపై డ్రగ్స్ అధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ పరిధిని దాటి వైద్యం చేస్తే కేసులు నమోదు చేయిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనధికార వైద్య సేవలపై తనిఖీలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.