భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

సంగారెడ్డి వెల్నెస్ సెంటర్‌లో 12:30కే లంచ్ బ్రేక్!

8e9e450c-d472-410c-8b35-d19265bf5ee7

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డిలోని ప్రభుత్వ వెల్నెస్ సెంటర్ ఉద్యోగుల పని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యాహ్న భోజన విరామం నిర్ణీత సమయాల్లో ఉంటుంది. అయితే సంగారెడ్డి వెల్నెస్ సెంటర్‌లో మధ్యాహ్నం 12:30 గంటలకే లంచ్ బ్రేక్ ప్రకటించి, వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఉద్యోగుల తీరుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మంగళవారం వెల్నెస్ సెంటర్‌కు వైద్యం కోసం వెళ్లిన కొందరు ఉద్యోగులు, జర్నలిస్టులకు మధ్యాహ్న భోజన విరామం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుందని సిబ్బంది తెలిపినట్లు సమాచారం. ఈ సమయంలో ఓపీ సేవలు అందుబాటులో లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ వెల్నెస్ సెంటర్లతో పోలిస్తే ఇక్కడ భిన్నంగా లంచ్ బ్రేక్ సమయం పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వైద్య సేవల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ముందుగానే సమయం కేటాయించుకుని వెల్నెస్ సెంటర్‌కు వస్తుంటారని, అయితే ఓపీ సేవలు అందక తిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత పని వేళలను, ఓపీ సేవలను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు.

ఈ వ్యవహారంపై పలువురు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెల్నెస్ సెంటర్‌లో లంచ్ బ్రేక్ సమయం, ఓపీ సేవల నిర్వహణపై సంబంధిత అధికారులు పరిశీలించి, రోగులు మరియు ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.