భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ట్రాన్స్‌ఫార్మర్ల రాగి తీగల దొంగల ముఠా అరెస్ట్

84d2905f-6980-4506-a007-bd8e3dd93848

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి తీగలను అపహరిస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. భైంసా పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ముధోల్‌లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా రాగి తీగల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.

వారి విచారణ ఆధారంగా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిలో ఒక బాల నేరస్తుడు ఉన్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో ఒకరు భైంసా పట్టణానికి చెందిన వ్యక్తి కాగా, మరో ఆరుగురు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 250 కిలోల రాగి, నాలుగు ద్విచక్రవాహనాలు, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

గత ఎనిమిది నెలల కాలంలో భైంసా డివిజన్ పరిధిలోని ముధోల్, భైంసా టౌన్, తానూర్, కుబీర్, బాసర, భైంసా రూరల్, కుంటాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ రాగి తీగల చోరీకి సంబంధించి 33 కేసులు నమోదైనట్లు ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంలో ప్రత్యేక నిఘా కీలకంగా పనిచేసిందని పేర్కొన్నారు.

కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర ఇన్‌స్పెక్టర్ దీపక్, ముధోల్ ఎస్‌ఐ బిట్ల పెర్సిస్, తానూర్ ఎస్‌ఐ జుబేర్, ఏఎస్సై నర్సింగ్ భాను, పోలీసు సిబ్బంది అమర్నాథ్, పోతన్న, గజేందర్, వెంకట సాయి, నరేంద్ర చారి, గగన్, సందీప్, వెంకట్ రావులను ఏఎస్పీ అభినందించారు.