భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, ఆగస్టు 2026, సోమవారంభారత్ సమాచార్

బాసర అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర మాజీ సీఎం

WhatsApp Image 2026-08-30 at 8.04.13 PM

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞానసరస్వతి దేవి ఆలయాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ అశోక్‌రావు చవాన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం అశోక్‌రావు చవాన్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా బాలాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అశోక్‌రావు చవాన్ కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వైదిక బృందం మాజీ ముఖ్యమంత్రిని శేష వస్త్రంతో సత్కరించింది. వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ ప్రాశస్త్యం, అమ్మవారి విశిష్టతకు సంబంధించిన వివరాలను అర్చకులు ఆయనకు వివరించారు.

బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం పట్ల అశోక్‌రావు చవాన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యకు అధిదేవతగా కొలిచే జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమాలకు బాసర క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.

అంతకుముందు ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన అశోక్‌రావు చవాన్‌కు భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్‌తో పాటు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బాసర ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ సీఎం పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.